రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న నాయకులే.. రేపు శత్రువులుగా మారిన సందర్భాలు అనేకం ఉంటాయి. అధికారం-అవకాశం అనే రెండు అంశాలనే నాయకులు ఎవరైనా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో వారు సొంత బంధువులనైనా అడ్డు వస్తారనుకుంటే.. దూరం పెడతారు. గతంలో ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో ఎన్నో ఎదురయ్యాయి. ఇప్పుడు కూడా ఏపీలో మనకు అనేక మంది నాయకులు ఇలానే వ్యవహరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇక, ఇప్పుడు తాజా పరిస్థితిని గమనిస్తే.. వైసీపీ సర్కారులో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. తనకు తిరుగులేదని భావిస్తున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. తాను చూస్తున్న దేవాదాయ శాఖలో ఎలాంటి విమర్శలు వచ్చినా.. ఎలాంటి ఘటనలు ఎదురైనా.. వెంటనే ఆయన స్పందిస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత అనుకూలమైన నాయకుడిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి కూడా నేతలను వైసీపీలోకి చేరుస్తూ.. తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇలా వెలంపల్లి తీసుకువచ్చిన నాయకుడే గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ నేత మద్దాలి గిరి. జగన్ సునామీని సైతం తట్టుకుని నిలబడి .. తొలిసారి విజయం సాధించిన గిరిధర్‌కు వెలంపల్లితో వ్యాపార సంబంధాలు బాగానే ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలోనే ఆయనను వెలంపల్లి వైసీపీలోకి తీసుకువచ్చారు. అయితే, ఇప్పుడు గిరిధర్.. వెలంపల్లికి చెక్ పెడుతున్నారనే వాదన వస్తోంది. ఆయన అనుచరుల ప్రచారాన్ని బట్టి.. రేపు రెండున్నరేళ్ల తర్వాత (ఇప్పటికే ఏడాదిన్నర పూర్తయింది) సీఎం జగన్ తన మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తే.. గిరికి ఛాన్స్ దక్కుతుందని, ఈ హామీతోనే ఆయన పార్టీ మారారని ప్రచారం జరుగుతోంది.
వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకుల్లో మంత్రి పదవి రేసులో ఉన్న వారిలో విజయనగరం జిల్లాకు చెందిన కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. స్వామికి మంత్రి పదవి రాకుండా అదే జిల్లాకు చెందిన సీనియర్‌నాయకుడు అడ్డు పడుతున్నందున వెలంపల్లిని పక్కన పెడితే.. తమ నేతే మంత్రి అవుతారని, అవసరమైతే.. బైపోల్లో పోటీ చేసి గెలిచేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారని గిరి అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో వెలంపల్లి అనుచర వర్గంలో తర్జన భర్జన మొదలైంది. తన సీటుకే ఎసరు తెస్తారా? అంటూ.. గిరిపై సదరు మంత్రి ఆలోచన చేస్తున్నారని ప్రచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కనుక.. దేనినీ కొట్టిపారేయలేం.
-vuyyuru subhash