మాతృభాషపై ప్రతి ఒక్కరూ పట్టు సాధించాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. ఫస్ట్ మదర్ టంగ్.. తర్వాత బ్రదర్ టంగ్.. ఆపై అదర్ టంగ్ అని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ సభ్యులతో స్వచ్ఛంద ప్రవర్తన నియమావళిని పాటింపజేయాలని సూచించారు. చట్టసభల్లో సభ్యులు హుందాగా ప్రవర్తించాలని కోరారు.
విజయవాడలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మేధావులు, వివిధ రంగాల ప్రముఖులను ఆప్యాయంగా పలకరించారు. 13వ ఉపరాష్ట్రపతిగా కొనసాగిన సమయంలో ఆ హోదాకు ఉన్న ప్రొటోకాల్ నిబంధనల కారణంగా ఎక్కువ మందితో నేరుగా కలిసి మాట్లాడలేకపోయానని, ఇప్పుడు అవరోధాలు తగ్గినందున తరచూ ఎక్కువ మందితో సమావేశాల్లో పాల్గొంటానని చెప్పారు. రాజకీయ నాయకులు క్రమశిక్షణతో మెలగాలని, ప్రజలతో ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగించాలని అప్పుడే మంచి ఫలితాలు పొందవచ్చన్నారు.
‘‘చట్టసభల్లో విమర్శలకంటే తిట్లదండకం పెరిగింది. పుస్తకాలు, కాగితాలు చించితే చొక్కాలు చించుకున్నట్టే. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టా. ఎంత విమర్శించినా ఎప్పుడూ పోడియం వద్దకు వెళ్లలేదు. మాట్లాడేటప్పుడు కొంత హాస్యం ఉండాలి, సబ్జెక్టు ఉండాలి. క్రిమినల్ రికార్డు ఉన్నవారికే రాజకీయాలన్నట్టు పరిస్థితి ఉంది. హక్కుల గురించే కాదు.. బాధ్యతల గురించీ ఆలోచించాలి’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.