బ్రిటన్ కొత్త ప్రధానికగా ఎన్నికైన లిజ్ ట్రస్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. మహారాణి ఎలిజబెత్ 2 మృతి పట్ల సంతాపం ప్రకటించారు. బ్రిటన్ రాజ కుటుంబానికి, యూకే ప్రజలకు భారత ప్రజల తరపున మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానిగా ఎన్నికైనందుకు ట్రస్‌కు అభినందనలు తెలిపారు.
యూకే విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు ఇరు దేశాల దైపాక్షిక సంబంధాల విషయంలో ఆమె చేసిన కృషిని మోదీ అభినందించారు. త్వరలో తాము ప్రత్యక్షంగా సమావేశం కానున్నట్టు ఇరు దేశాల నేతలు వెల్లడించారు. భారత్-యూకే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపరచడానికి ఇరు దేశాల నేతలు కట్టుబడి ఉన్నారని భారత ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. 2030 రోడ్‌మ్యాప్ అమలులో పురోగతి, కొనసాగుతున్న ఎఫ్‌టీఏ చర్చలు, రక్షణ-భద్రత సహకారం, ప్రజల మధ్య సంబంధాలతో సహా ద్వైపాక్షిక ఆసక్తికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారని తెలిపింది.