ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో స్వర్గీయ శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ సభ జరుగగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… ఈనాటి రాజకీయ నాయకులందరికీ పిన్నమనేని స్ఫూర్తిదాయకమని.. రాజకీయాల్లో హుందాతనం తగ్గిపోతుందని పేర్కొన్నారు.
పార్లమెంటు, అసెంబ్లీ, కార్పొరేషన్ లలో వాడే భాష, అనుసరిస్తున్న తీరుపై అందరూ సమీక్షించుకోవాలని కోరారు. అందరూ బుద్ధితనం చూపించాలి.. పరిధులు దాటి వ్యవహరించకూడదని సూచనలు చేశారు. చిన్నప్పుడు బిజెపి కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ జన సమీకరణ చేసేవాడినని.. ప్రతి రోజు సాయంత్రం ఇవాళ నా బాధ్యతకు న్యాయం చేయగలిగానా లేదా అని ప్రతి నాయకుడు ఆలోచించాలని కోరారు.
కులతత్వం, ప్రాంతీయతత్వం మారాలి …. లేకుంటే దేశం బలహీనపడుతుందని వెల్లడించారు. కులం, క్యాష్, క్రిమినాలిటీ ప్రస్తుతం పెరిగిపోయాయని.. రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోపై చట్టబద్ధత కల్పించే అంశంపై చర్చ జరగాలని పేర్కొన్నారు. ఐదేళ్ల కొకసారి ఓటేశాం అని ప్రజలు వదిలేయకూడదు. గెలిపించిన వ్యక్తి ఎలా పనిచేస్తున్నాడో కూడా చూస్తుండాలని.. పత్రికలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.