ఏపీ రాజకీయాలపై మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఇంకా ముందు వస్తే ఈ ఎన్నికల్లో పరిస్థితి వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆలస్యంగా వచ్చినా వైసీపీ సర్కారుపై ఆమె బాగా పోరాటం చేశారని ప్రశంసించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహం నమూనా పరిశీలించేందుకు గురువారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన వీహెచ్ నగరంలోని రాజీవ్‌గాంధీ కళాశాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల అన్న కోసం రాష్ట్రమంతటా పర్యటించారని వీహెచ్ తెలిపారు. తర్వాత ఆమెకు రాజకీయంగా ఎటువంటి అవకాశం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదని, అయితే రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనల గురించి తనకు తెలుసని వీహెచ్ తెలిపారు. మరోవైపు బీజేపీ సర్కారు తీరుపై వీహెచ్ మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ ఏం అభివృద్ధి చేశారని హనుమంతరావు ప్రశ్నించారు. యూపీఏ హయాంలోనే అభివృద్ధి అంతా జరిగిందని అన్నారు.