ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ఢోకా లేదన్నారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. మూడేళ్ల క్రితం కొవిడ్–19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం ఆరంభించింది. 2020 మర్చి చివరిలో భారత ప్రభుత్వం కాస్త ముందుగా మేల్కొని లాక్‌డౌన్ ప్రకటించింది. కొన్ని మాసాలపాటు దాన్ని కట్టుదిట్టంగా అమలు చేసింది. ఏడాది తర్వాత కరోనా వైరస్ దూకుడు తగ్గిపోయాక భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం వేగంగా మొదలైంది. మూడేళ్ల తర్వాత ఇండియా ఆర్థికరంగంలో స్పీడందుకుంటోందని వెల్లడించారు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దేశంలోని మిగిలిన అభివృద్ధిచెందిన రాష్ట్రాల మాదిరిగానే శరవేగంతో పయనిస్తోంది. దాదాపు ఏడాదిన్నరపాటు కరోనావైరస్ వ్యాప్తితో అతలాకుతలమైన రాష్ట్ర ఆర్థికవ్యవస్థ కుదుటపడడమేగాక, అంచనాలకు మించిన వేగంతో ముందుకు కదులుతోంది. కొవిడ్–19 మహమ్మారి నెమ్మదించిన ఏడాదిన్నరకు అంటే 2021–22లో ఆర్థికాభివృద్ధిలో ఏపీ మంచి పురోగతి సాధించింది. ఆ కాలంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 8.7% వద్ద నిలబడగా, ఆంధ్రప్రదేశ్ 11.43% వృద్ధి రేటుతో పరుగులు తీయడం ప్రారంభించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు నిండుతుండగా అదే తీరున మెరుగైన ప్రగతి సాధిస్తోందని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.