టీడీపీ పుట్టింది హైదరాబాద్‌ లోనే గాని, తెలంగాణకు నువ్వేం చేశావ్, చంద్రయ్యా – విజయసాయి

-

టీడీపీ పుట్టింది హైదరాబాద్‌ లోనే గాని, తెలంగాణ ప్రగతికి పునాదులు వేసింది మాత్రం నీ పార్టీ కాదు, చంద్రయ్యా! అంటూ చంద్రబాబును టార్గెట్‌ చేశారు విజయసాయిరెడ్డి. ‘తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలో..హైదరాబాద్‌లోనే..’ అన్న ఈ పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు మాటలు వాస్తవమేగాని, ఆయన చెప్పుకున్నట్టు తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమానికి పునాదులు వేసింది మాత్రం టీడీపీ కాదు. బుధవారం ఖమ్మంలో తెలుగుదేశం బహిరంగసభలో ప్రసంగించిన మాజీ సీఎం గారి అబద్ధాలు, అర్థసత్యాలకు హద్దూపద్దూ లేకుండా పోయిందని ఆగ్రహించారు.


నాలుగొందలేళ్లకు పైగా హైదరాబాద్‌ రాజధానిగా ఉన్న తెలంగాణ అంతకు మునుపే ప్రగతి సాధించిన ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా 20వ శతాబ్దం చివరి పదేళ్లలో (1990 నుంచి) వచ్చిన సమాచార సాంకేతిక విప్లవంలో భాగంగా హైదరాబాద్‌ భారత ఐటీ రంగానికి కీలక స్థానంగా ఎదిగిందేగాని, బాబు గారు చెబుతున్నట్టు టీడీపీ సర్కారు కృషి వల్ల అంతా జరగలేదు. పదే పదే ప్రస్తావించే హైటెక్‌ సిటీ, సైబరాబాద్‌ అవతరించి, అభివృద్ధి చెందిన క్రమం అంతా అంతర్జాతీయ పరిణామాల్లో భాగంగానే కొనసాగింది. తాను ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న 9 ఏళ్లలో సొంత పార్టీలో ఎవరైనా ‘తెలంగాణ’ అనే మాట ఉచ్చరిస్తే ఉరిమి ఉరిమి చూసిన ఈ మాజీ ‘గ్లోబల్‌ హైటెక్‌ లీడర్‌’ కు ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణపై ప్రేమ పుట్టుకొచ్చింది. తనకు 1978 నుంచీ ఆశ్రయమిచ్చిన ప్రాంత ప్రజలపై అభిమానం పొంగిపొర్లుతోందని చెప్పారు విజయసాయిరెడ్డి.

ఈ రాష్ట్రంలోని అభివృద్ధి అంతటికీ, హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీ కావడానికి– టీడీపీ కృషే కారణమని ఆయన చెబుతున్న మాటలను తెలంగాణ ప్రజలు వరుసగా 2004, 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తిరస్కరించారు. ఆయన కబుర్లను నమ్మలేదు. రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదిన్నరేళ్ల తర్వాత ఇప్పుడు చంద్రబాబు ‘తెలంగాణకు తాను ఇంత చేశాను, అంత చేశాను..’ అంటే జనం విశ్వసించే బలహీన స్థితిలో లేరు. 2018 శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు ఆయన జీవితకాలం గుర్తుంచుకునేలా గొప్ప గుణపాఠం చెప్పారు. అయినా, తెలుగుదేశం అనే ఒక ప్రాంతీయపక్షం ‘జాతీయ అధ్యక్షుడు’గా చెలామణి కావడానికి ఏపీ సరిహద్దులోని నగరాలు లేదా ఆంధ్రా మూలాలున్న కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో ‘శంఖారావాలు’ పేరుతో బహిరంగసభలు పెడితే జనం హర్షించరు. చేసే పనేంటో టీడీపీకి నామమాత్రపు ఉనికి ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో చేస్తే మేలు. అక్కడే బాబూ కొడుకులు ఇద్దరూ జనం మధ్య తిరిగితే కొన్ని చోట్లయినా డిపాజిట్లు దక్కుతాయి. అంతేగాని తనకు న్యాయంగా చెందని ఘనత గురించి… త్వరలో 73వ పుట్టినరోజు జరుపుకోనున్న తెలుగు వృద్ధనేత నోటికొచ్చినట్టు ప్రసంగాలు దంచికొట్టడం ఎవరికీ క్షేమం కాదు. ప్రయోజనకరం కూడా కాదన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version