ఇండియాను పరిపాలించడం నిజంగా అంత కష్టమా? బ్రిటిష్ వారి కాలంలో అది వాస్తవవేమో కాని ఇప్పుడు కాదంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.ఇండియా అనేక ప్రాంతాలు, జాతులు, భాషలు, మతాలు, సంస్కృతులు ఉన్న విశాల దేశం అన్నారు. ప్రపంచంలోని అతి ప్రాచీన దేశాల్లో ముఖ్యమైనది కూడా. మూడు వైపులా సముద్రాలు, ఒక వైపున మంచు పర్వతాలున్న ఈ దేశాన్ని చరిత్రలో మొదట అనేక మంది చక్రవర్తులు, రాజులు పరిపాలించారని తెలిపారు.
మొత్తం దేశాన్ని పరిపాలించడం చాలా కష్టమని అనేకసార్లు రుజువైంది. పారిశ్రామిక నాగకరికత, గొప్ప విశ్వవిద్యాలయాలు, అంతకన్నా ఘనమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వందలాది ఏళ్లుగా ఉన్న బ్రిటిష్ వారు కూడా నిండా 200 ఏళ్లు వైవిధ్యభరితమైన భారతదేశాన్ని పరిపాలించలేకపోయారు. స్వాతంత్య్రపోరాటం ఫలితంగా ఇంగ్లిష్ పాలకులు 1947 ఆగస్టులో ఇండియాకు స్వాతంత్య్రం ఇవ్వక తప్పలేదని వివరించారు.
ఈ విషయాలన్నీ ఇక్కడ ఎందుకు ప్రస్తావించాల్సివచ్చిందంటే–ఇప్పటికీ దేశంలో ఏదైనా ఓ మోస్తరు అంతర్గత సంక్షోభం తలెత్తితే.. కొందరు మధ్య తరగతి మేధావులు ‘భారతదేశాన్ని సమర్ధంగా పరిపాలించడం చాలా కష్టం,’ అని వ్యాఖ్యానించడం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు నెల రోజులుగా అంతర్గత కల్లోలంతో ఉన్న బుల్లి ఈశాన్య రాష్ట్రం మణిపూర్ సమస్యను చూపించి కూడా ఇలాగే కొందరు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 1970లు, 80లు, 90ల్లో అనేక సవాళ్లను అధిగమించిన ఇండియా 2000 సంవత్సరం నాటికి అనూహ్య ప్రగతి సాధించింది. తనపై పూర్వం ఉన్న అన్ని దురభిప్రాయాలను భారతదేశం పటాపంచలు చేసింది. ఆ తర్వాత 22 ఏళ్లకు ప్రపంచ ఆర్థికశక్తిగా అవతరించిందని అభిప్రాయపడ్డారు విజయసాయిరెడ్డి.