లోక్ సభ ఎన్నికలపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్ చేశారు. మరో ఏడు నెలల్లో జరిగే 18వ లోక్ సభ ఎన్నికలకు అన్ని రాజకీయపక్షాలు సిద్ధమౌతున్నాయి. ఈ సందర్భంలో రెండు ప్రధాన జాతీయపక్షాలు కాంగ్రెస్, బీజేపీల బలాబలాల్లో గత నాలుగు దశాబ్దాల్లో వచ్చిన మార్పులపై రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 1980లో అవతరించాక 1984లో జరిగిన మొదటి ఎన్నికల్లో కేవలం రెండే సీట్లు గెలుచుకుంది. తర్వాత ఐదేళ్లకు జరిగిన 1989 పార్లమెంటు ఎన్నికల్లో ఈ పార్టీ బలం 85కు పెరిగిందన్నారు. ఏడాదిన్నరకే వచ్చిన 1991 మధ్యంతర ఎన్నికల్లో ఈ బలం 120 సీట్లకు పెరగడం విశేషం అన్నారు.
తర్వాత ప్రధాని పీవీ నరసింహారావు గారి ఐదేళ్ల పాలన తర్వాత జరిగిన 1996 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బలం ఒక్కసారిగా 161 స్థానాలకు పెరిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ (272) రాకపోయినా బీజేపీ సీనియర్ నేత ఏబీ వాజపేయి నేతృత్వంలో కేంద్రంలో తొలిసారి సర్కారు ఏర్పాటయింది. ఆ తర్వాత 1998, 1999 లోక్ సభ ఎన్నికల్లో వరుసగా 182, 182 స్థానాలు గెలుచుకుంది బీజేపీ. 1999 ఎన్నికల్లో ఈ పార్టీకి బలం పెరగలేదుగాని అంతకు ముందు సాధించిన 182 సీట్లు నిలబెట్టుకోవడం విశేషం. అయితే, 2004, 2009 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బలం వరుసగా 138, 116 సీట్లకు తగ్గిపోయిందని పేర్కొన్నారు.
2014 ఎన్నికల్లో బీజేపీ బలం ఒక్కసారిగా 116 నుంచి 282 సీట్లకు ఎగబాకింది. సాధారణ మెజారిటీ సొంతంగానే సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ (272కు పైగా సీట్లు)పార్టీ స్థాపించిన 34 సంవత్సరాలకు బీజేపీకి వచ్చింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమంటే…1998,99 వరుస ఎన్నికల్లో రెండుసార్లూ 182 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ బలం వంద పెరిగి 282కు చేరడానికి అప్పటి నుంచి 15 ఏళ్లు పట్టింది. 2019లో జరిగిన కిందటి లోక్ సభ ఎన్నికల్లో తన బలాన్ని 303కు పెంచుకోవడం ద్వారా బీజేపీ కొత్త మైలురాయి దాటిందని వెల్లడించారు విజయసాయిరెడ్డి.