జన్ విశ్వాస్ బిల్లుపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నపాటి తప్పిదాలను నేరంగా పరిగణించే శిక్షార్హమైన పలు నిబంధనలు తొలగించేందుకు ఉద్దేశించిన జన్ విశ్వాస్ బిల్లు మాదిరిగానే రాష్ట్ర చట్టాలలో కూడా చిన్నపాటి నేరాలను శిక్షార్హమైన జాబితాను తొలగించేలా ప్రక్షాళన చేపట్టాలని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. జన్ విశ్వాస్ బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ కేంద్ర చట్టాలతో పోల్చుకుంటే చిన్నపాటి తప్పిదాలకు శిక్షార్హమైన నిబంధనలు నాలుగు రెట్లు అధికంగా ఉన్నాయని ఆయన అన్నారు.
ప్రతి పౌరుడు, వ్యాపారాలు కేంద్ర చట్టాలనే కాకుండా రాష్ట్ర చట్టాలను కూడా అనుసరించాల్సిన ఉన్నందున రాష్ట్ర చట్టాలలో ఇలాంటి ప్రక్రియ పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. అయితే రాష్ట్ర చట్టాలను సవరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేనందున ఈ తరహా సవరణలు చేసేందుకు వీలుగా కేంద్ర రాష్ట్ర శాసనకర్తలకు మార్గదర్శనం చేయాలని కోరారు. రాష్ట్రాలతో సంప్రదించి చిన్నపాటి తప్పిదాలను శిక్షార్హమైన నేరాల జాబితా నుంచి తొలగించే చట్టాలను సవరించేలా వాటికి సాయపడే బాధ్యతను లా కమిషన్‌కు అప్పగించాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
పౌరులు జీవనాన్ని, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఉద్దేశించిన ఈ బిల్లును చట్టం చేసినంత మాత్రాన సరిపోదని, ప్రజలు దీనికి కట్టుబడి ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో చట్ట నిబంధనలు శరవేగంగా మారిపోతున్నాయి. నిబంధనలలో ఏడాదికి 3500 సవరణలు వస్తున్నాయి. నిబంధనలలో తరచుగా జరిగే ఈ మార్పులను తెలుసుకోవడానికి ఏకైక డేటా బేస్ అంటూ ఏదీ లేదు. కాబట్టి ఈ సమాచారమంతా ఒకేచోట లభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అలాగే ప్రతి చట్టం లేదా క్లాజ్ నిర్ణీత కాలవ్యవధిలో ముగుస్తుందని తెలిసేలా ఈ బిల్లులో సన్‌సెట్ క్లాజెస్‌ను జోడించాలని ఆయన కోరారు.