భారీ వర్షాలు.. వరదలు చైనాను వణికిస్తున్నారు. ముఖ్యంగా.. ‘దొక్సూరీ’ తుఫాను ఉత్తర చైనాను చిగురుటాకులా వణికిస్తోంది. రాజధాని బీజింగ్.. పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం బీభత్సం ప్రజలను భయకంపితులన్ని చేస్తోంది. శనివారం, బుధవారం మధ్య 74.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ స్థాయిలో బీజింగ్‌లో వర్షపాతం నమోదు కావడం 140 ఏళ్లలో ఇదే తొలిసారని అక్కడి వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. భారీ వర్షాలతో.. వరదలతో ఆ దేశ పౌరులు అల్లాడిపోతున్నారు.
చైనాలో రహదారులన్నీ చెరువులను తలపిస్తుండగా.. కార్లు.. ఇతర వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. వంతెనలు తెగిపోయాయి రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఆ దేశంలోని లక్షల మంది ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. కొండ చరియలు విరిగిపడి భారీ స్థాయిలో ఇళ్లు నేలకూలుతున్నాయి. ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. బీజింగ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు 21 మంది మృతి చెందారు. మరోవైపు హుబే ప్రావిన్స్‌లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ 8,50,000 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. 26 మంది జాడ తెలియడం లేదు.