విజయవాడ దుర్గగుడి పై భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. అయితే ఆ కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ. అనంతరం ఈ ఘటన పై సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలతో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కొండ చరియలు విరిగి ప్రోటోకాల్ ఆఫీస్ పై పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ఆస్తి నష్టం జరగలేదు.
అయితే ఈ వర్షం పడడం వల్ల ప్రస్తుతం ఘాట్ రోడ్డు మూసి వేయడం జరిగింది. ఇక రానున్న మూడు రోజులు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఘాట్ రోడ్డు మూసివేయ బడుతుంది అని తెలిపారు. భక్తుల శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మెట్ల మార్గాన్ని, లిప్ట్ మార్గాన్ని మాత్రమే భక్తులు వినియోగించు కోవాలి. దీని కోసం భక్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఇక భక్తుల శ్రేయస్సు కోసం అన్ని రకాల చర్యలు చేపడతాం అని కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు.