విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ దుర్గగుడి పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు మాట్లాడుతూ.. తమ హయాంలో దసరా, భవానీ దీక్షలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో అన్నదాన వితరణ జరిపామని ప్రకటన చేశారు. భక్తులకు దర్శనం కల్పించామని.. రెండేళ్ల కాలంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు.
శివాలయం పున నిర్మాణం, లడ్డూ పోటు, అన్నదానం, ఘాట్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టామని.. దుర్గగుడిలో మహిళా క్షురకులను నియమించాలని తీర్మానించామని వెల్లడించారు.
మహిళల మనోభావాలు పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించామని.. తిరుమల తరహాలో 20 మంది మహిళా క్షురకులకు నియమించే విధంగా తీర్మానం చేసి కమిషనర్ కు పంపామన్నారు. సిఎం జగన్ 70 కోట్ల రూపాయలు మంజూరుతో అనేక అభివ్రుద్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని… దుర్గగుడిలో పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టబోతున్నామని స్పష్టం చేశారు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు.