నేడు విశాఖ ఉక్కు పరిరక్షణకై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కాస్త రసాభాసగా మారింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, వైసీపీ ట్రేడ్ యూనియన్స్ నేత గౌతమ్ రెడ్డి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమంలో సీఎం జగన్ ప్రత్యక్షంగా పాల్గొనాలన్నారు.
ప్రధాని దగ్గరకి అన్ని సంఘాల వారిని సీఎం జగన్ తీసుకువెళ్లే చొరవ తీసుకోవాలన్నారు రామకృష్ణ. ఇది ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి సీఎం స్పందించాలన్నారు. దీంతో రామకృష్ణ వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపారు గౌతమ్ రెడ్డి. ప్రధాని దగ్గరకు వెళ్ళేది అన్ని పార్టీల ప్రతినిధులు వెళ్తే వస్తామన్నారు గౌతమ్ రెడ్డి.
ఇప్పటికే ఈ అంశంపై జగన్ ప్రధాని తో మాట్లాడారని తెలిపారు. రాజకీయ పార్టీ ప్రతినిధిగా వస్తామన్నారు గౌతం రెడ్డి. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ.. వాజ్ పెయి సమయంలో ఇబ్బంది వస్తే చంద్రబాబు మాట్లాడారని, మన్మోహన్ సింగ్ సమయంలో ఇబ్బంది వస్తే అప్పటి సీఎం మాట్లాడారని.. ఇపుడు జగన్ కూడా స్పందించాలన్నారు. ఉద్యమం వైపు జగన్ నిలబడాలన్నారు దేవినేని ఉమ.