నడిచి వెళ్లే యాత్రికులకు అండగా ఉంటాం అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ తిరుమల అలిపిరి మార్గంలో భక్తులకు కర్రలను పంపిణీ చేసిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడారు. చేతిలో కర్ర ఉంటే ఏ జంతువువైనా దాడి చేయడానికి వెనుకంజ వేస్తుందని చెప్పారు. పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా పల్లెలలో పొలాలకు వెళ్లేటప్పుడు, అడవిలోకి వెళ్లేటప్పుడు చేతి కర్రలు తీసుకొని వెళ్లడం సాంప్రదాయంగా వస్తుంది అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం యాత్రికుల భద్రత చర్యలు పాటిస్తున్నాం. భద్రతా సిబ్బంది నడిచివెళ్లే సమయంలో అండగా ఉంటారు. అక్కడక్కడ పోలీస్ సిబ్బంది ఉంటారు. ఇప్పటికే బోన్లను ఏర్పాటు చేసి నాలుగు చిరుతలను పట్టారు. కావాలనుకున్న వారికే కర్రలను పంపిణీ చేస్తున్నాం. నడిచి వెల్లే యాత్రికులకు అండగా ఉంటాం. గుంపులు గుంపులుగా ప్రయాణించాలని.. ప్రతీ ఒక్కరికీ చేతి కర్ర ఊతంగా.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఇస్తున్నామని తెలిపారు.