వైసీపీ పార్టీ ఇవాళ్టి నుంచి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. నేటి నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం ప్రారంభం కానున్న తరుణంలోనే.. వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలంలో ప్రతిరోజూ ఒక సచివాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.
ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచిని ప్రజలకు చెప్పాలన్నారు సీఎం జగన్. గ్రామాల వారీగా ఎంత నగదు బదిలీ చేశాం.. తద్వారా ఎంతమందికి ఏ మేరకు లబ్ధి జరిగిందన్న దానిపై ప్రతి ఒక్కరికీ వివరాలు అందించాలని కోరారు. గ్రామాల్లో ఆర్బీకే సెంటర్లు, సచివాలయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్కూళ్లు, ఆస్పత్రుల్లో అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులను నాడు–నేడు రూపంలో వివరించాలని…ఇలా గతానికి భిన్నంగా మెరుగుపడిన పరిస్థితుల తీరును తెలియజేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా బోర్డులు పెట్టాలి…ఏయే పథకం ద్వారా ఎంతమంది లబ్ధిపొందారో అందులో ప్రదర్శించాలని వివరించారు.