మంచంపై నిద్రపోతున్న భర్తపై మరుగుతున్న వేడి నూనె పోసి భార్య పరారైన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఇంటి యజమాని గమనించి ఆస్పత్రికి తరలించడంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. దాడికి పాల్పడిన మహిళ గర్భిణీగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సాలాపువానిపాలెంలో బాలకృష్ణ, రమణమ్మ దంపతులు నివాసముంటున్నారు. మద్యం మత్తులో భర్త రోజూ వేధిస్తున్నాడని, బాలకృష్ణపై రమణమ్మ మరిగిన నూనె పోసి, అనంతరం గోడ దూకి ఇంటి నుంచి పారిపోయింది. అయితే వెళ్లేటప్పుడు ఇంటి తలుపు మూసి వెళ్లడంతో గమనించిన పొరుగింటి వ్యక్తి బాలకృష్ణను కాపాడి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. బాధితుడి శరీరం 45 శాతం కాలినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.