ఏపీలోని తాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు ప్రపంచ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో కొద్దిరోజుల క్రితం వేర్వేరుగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారిపేటలో తాగునీటి సరఫరా చేస్తున్న విధానాన్ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు. జల్‌జీవన్ మిషన్‌లో ఇప్పటివరకు చేసిన పనులు, మిగిలిన పనులు సహా పలు విషయాలపై చర్చించారు.
మరోవైపు డ్యాంల భద్రతకు కేంద్రం అమలు చేస్తున్న పథకంలో ప్రపంచ బ్యాంకు సాయం చేస్తోంది. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం 70 శాతం నిధులు భరిస్తే, రాష్ట్రం 30 శాతం వాటా ఇవ్వాల్సి ఉండగా.. ఆ 30 శాతం భరించేందుకు ఇన్నాళ్లూ జగన్ సర్కార్ ముందుకు రాలేదు. ప్రాజెక్టుల భద్రతకు కేంద్రం ఇచ్చే నిధులను సరిగా ఉపయోగించుకోలేదు. ఈ పరిస్థితుల్లో ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు రుణంతో మొదట జల్‌జీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లు పెండింగ్ పనుల పూర్తికి కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు.