మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసు పై సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక సీఎం జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో “ఐపీసీ” అమలు కావడం లేదని.. “జేపీసీ” (జగన్ పీనల్ కోడ్) అమలవుతుందని విమర్శించారు. పోలీసులు కూడా జేపీసీనే ఫాలో అవుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని కరప్ట్ చేసి అవినీతి పాలన చేస్తున్నప్పుడు సీఎం జగన్ కు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో ఎవరు పాదయాత్ర చేయడానికి అవకాశం లేదా? అని ప్రశ్నించారు. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ లక్ష కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. ఆ అవినీతి సొమ్ముతోనే ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. శనివారం తిరుమలలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.