కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని పోలీసులు అరెస్టు చేయడం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిపై వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నాడు అసెంబ్లీలో దాడి నుంచి నేటి అక్రమ అరెస్టు వరకు… ప్రతి చర్య దళిత నాయకుడైన స్వామి గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రేనన్నారు.
తమ పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అహంకార ధోరణిని దళిత సమాజం గమనిస్తోందని.. మీకు బుద్ది చెప్పడానికి సిద్దం అయ్యిందన్నారు. నా సోదరుడు స్వామి మీ అక్రమ అరెస్టులకు, వేధింపులకు భయపడే నేత కాదన్నారు చంద్రబాబు. వీరాంజనేయ స్వామి ఎదిరించి పోరాడే నాయకుడన్నారు. పోలీసులు వైసీపీ క్రియాశీల కార్యకర్తల్లా కాకుండా… చట్టబద్దంగా వ్యవహరించాలని.. వెంటనే స్వామిని విడుదల చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.