జూలై 30 – 2016… వైఎస్సార్ పై అక్కసుతో.. విగ్రహాలు చూసి మాత్రమే ప్రజలు ఆయనను జ్ఞప్తికి తెచ్చుకుంటారానే భ్రమతో.. మచిలీపట్నం – ఏలూరు రోడ్డులోనుంచి వన్ టౌన్ లోకి వెళ్లే ప్రతి ఒక్కరికీ ఈ విగ్రహం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందనే అసూయతో.. గత టీడీపీ ప్రభుత్వం చేసిన ఒక విద్వేషపూరిత చర్యను తాజాగా మరోసారి వైఎస్సార్ అభిమానులు గుర్తుకుతెచ్చుకుంటున్నారు. అందుకు కారణమైంది తాజాగా చినబాబు లోకేష్ చేసిన ట్వీట్!
“తమ పర” భేదాలు చూడకుండా “అంతా ఒక్కటే” అని భావించే వ్యక్తులకు.. “తాము” మాత్ర్రమే అని ఆలోచించే వ్యక్తులకూ ఉన్న తేడాను గమనించడంలో పరిపూర్ణంగా విఫలమైన నారా లోకేష్… తాజాగా ఒక ట్వీట్ ట్వీటారు. అదేమిటయ్యా అంటే… “90 కేసులు ఉన్న క్రిమినల్ కి కాంస్య విగ్రహం పెడతామని స్వయంగా మంత్రి ప్రకటించినప్పుడే రాజారెడ్డి రాజ్యాంగంలో మహనీయుల విగ్రహాలకు చోటులేదని అర్థమైంది” అంటూ మొదలుపెట్టారు. కేసులు ఉన్నంతమాత్రాన్న నేరస్థులు కాదు, దోషులూ కాదు.. అవి నిరూపణ అయినప్పుడు మాత్రమే నేరస్థులు, దోషులు అన్న ఆలోచన లేకుండా… తన తండ్రిపై ఎన్ని కేసులున్నా కోర్టుకెళ్లి స్టేలు తెచ్చుకున్నారన్న సోయ ఏమాత్రం లేకుండా.. ఇలా స్పందించారు!!
ఇదే క్రమంలో… “నెల్లూరు జిల్లా కావాలిలో తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, కూడు, గూడు, గుడ్డ ఉన్ననాడే పేదవాడికి సంపూర్ణ స్వరాజ్యమన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం తొలగించారు” అని ట్వీటారు. తాజాగా ఎన్టీఆర్ విగ్రహం తొలగించడానికి గల కారణాలు ఏమిటి అన్న ఆలోచన ఏమీ లేకుండా, కనీసం అడిగి తెలుసుకునే ఆలోచన కూడా లేకుండా ఇలా స్పందించారు! సరిగ్గా ఇక్కడే 2016లో టీడీపీ ప్రభుత్వం వైఎస్ పై అక్కసుతో చేసిన ఒక దుర్మార్గపు చర్యను గుర్తుకు తెచ్చుకుంటున్నారు వైఎస్సార్ అభిమానులు!
కృష్ణా పుష్కరాల సందర్భంగా రహదారుల విస్తరణ పేరిట విజయవాడ నగరంలో విగ్రహాల తొలగింపులో భాగంగా తెల్లవారుజామున నగర నడిబొడ్డులో ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని పన్నెండడుగుల వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహం తొలగింపు చర్యకు పూనుకుంది నాటి టీడీపీ ప్రభుత్వం. ఇదే క్రమంలో ప్రార్థనా మందిరాలు, జాతీయ నేతల విగ్రహాలు కూడా తొలగించారు! దీంతో… ఈ తొలగింపుపై కులమతాలకతీతంగా కాంగ్రెస్, వైఎస్ అభిమానులు నిప్పులు చెరిగారు. 2012లో నాటి ఎంపి లగడపాటి రాజగోపాల్ దాదాపు రూ.30 లక్షలు వెచ్చించి ఈ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు.
దీంతో… ఈ సంఘటనను గుర్తుకు తెచ్చుకున్న వైఎస్సార్ అభిమానులు… నేడు ట్విట్టర్ వేదికగా మహనీయుల విగ్రహాలపై ప్రేమ కురిపించేస్తున్న లోకేష్ కు.. నాడు మహనీయుడు, మహానాయకుడు, మహానేత వైఎస్సార్ విగ్రహంతో పాటు జాతీయ నాయకుల విగ్రహాలు, ప్రార్థనా మందిరాలు ముందస్తు సమాచారం కూడా లేకుండా తొలగించినప్పుడు “మహనీయుల విగ్రహాలు” అనే ప్రేమ ఆ “నారా రాజ్యాంగం” నడిచిన రోజుల్లో గుర్తుకురాలేదా అని ప్రశ్నిస్తున్నారు!
నేడు ఎన్టీఆర్ విగ్రహం తొలగించడం అనేది నాడు వైఎస్సార్ విగ్రహం తొలగించడానికి సరిపడా ప్రతికార చర్యగా చూసే అర్థజ్ఞానుల సంగతి కాసేపు పక్కనపెడితే… తాజాగా లోకేష్, “మహనీయుల విగ్రహాల” ప్రస్థావన తేవడం ద్వారా.. నాడు అధికారం ఉందనే అహంకారంతో వైఎస్ విగ్రహాలపట్ల వారు చూపించిన అక్కసు… మరోసారి గుర్తుకువచ్చింది అనేది వైఎస్ అభిమానుల మాటగా ఉంది!!