బీజేపీపై జగన్ అస్త్రం ! ఎమ్మెల్యేలకు కీలక సూచనలు ?

-

జగన్ ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి దాడులు చేసేందుకు ప్రతిపక్షాలన్నీ కాచుకు కూర్చున్నాయి. ఇప్పటి వరకు జగన్ ను, ఆయన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు సరైన కారణాలు దొరకకపోవడంతో సైలెంట్ గానే ఉంటూ వస్తున్న బిజెపి, జనసేన, టీడీపీలకు అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చెందిన రథం దగ్ధం అవడం, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి చెందిన వెండి రథం సింహాలు చోరీకి గురవడం,మరికొన్ని సంఘటనలు చోటు చేసుకోవడంతో మూకుమ్మడిగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చాలని సీబీఐ కు జగన్ లేఖ రాయించినా, ప్రతిపక్షాలు మాత్రం శాంతించడం లేదు. హిందూ వ్యతిరేక ముద్ర జగన్ పై వేసి, ఆయనను ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నాయి.


మొన్నటి వరకు బిజెపి వైసిపి ల మధ్య అనధికారిక పొత్తు ఉన్నా, ఇప్పుడు మాత్రం రెండు పార్టీలు బద్ధశత్రువుల్లాగే వహరిస్తున్నాయి. ముందు ముందు కూడా బిజెపి వైసీపీ విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉన్న నేపథ్యంలో, జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ఏ బిజెపి నాయకుడు ప్రయత్నించినా, వెంటనే నిలువరించాలని, మీడియాలో హైలెట్ కాకుండానే ఎక్కడికక్కడ ఆందోళన చేసే అవకాశం ఉన్న నాయకులను కట్టడి చేయాలని, అలాగే ఆ నాయకుల బలాలు, బలహీనతలను గుర్తించాలని సూచనలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

బిజెపి, టిడిపి లు ఒక పథకం ప్రకారం వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని, అలాగే హిందూ దేవాలయాల వద్ద భద్రత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, వాలంటీర్లను దేవాలయాల వద్ద నియమించుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, మతపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలని, ప్రతిపక్షాల విమర్శలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇకపై ఈ తరహా సంఘటనలు జరగకుండా ప్రభుత్వం సైతం అన్ని దేవాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను  చేస్తోంది. ముఖ్యంగా రాజకీయ దుమారం రేపేందుకు కొంతమంది కావాలని ఈ తరహా దాడులు హిందూ దేవాలయాలపై చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అవ్వడంతో పాటు, తమ పార్టీ నాయకులను అలర్ట్ చేస్తుంది.

-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version