వైఎస్సార్ సీపీలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక దానిని గుంటూరు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కు ఇవ్వ నున్నారనే వార్తలు వచ్చాయి. వాస్తవానికి గత ఏడాది ఎన్నికలకు ముందుగానే ఇచ్చిన హామీ మేరకు మర్రి కి ఇలా పదవి ఇవ్వడం సముచితమే. అయితే, దీని వెనుక జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మండలిలోను బయటా కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కమ్మవర్గం అండగా ఉంది. ఎక్కడికక్కడ కమ్మ వర్గానికి చెందిన నాయకులు జగన్‌కు సవాళ్లు రువ్వుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ కొద్ది రోజులుగా రాజధాని జిల్లాలుగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ వర్గం కీలక నేతలను తమ వైపునకు తిప్పుకుంటూ టీడీపీకి, టీడీపీకి కొమ్ము కాసే ఆ కమ్మలకు వ్యూహాత్మకంగా చెక్ పెట్టుకుంటూ వస్తున్నారు.
ఇప్పటికే టీడీపీలో గతంలో ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు దేవినేని అవినాష్ లాంటి నేతలు ఇప్పటికే వైసీపీకి దగ్గరయ్యారు. ఇక టీడీపీ కమ్మలు వ్యూహాత్మకంగా ఈ రెండు జిల్లాల్లో కొన్ని వర్గాలను రెచ్చగొడుతూ అయినదానికి కానిదానికీ జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బలమైన గళం వినిపించేందుకు మండలిలో కమ్మ వర్గానికి చెందిన నాయకుల అవసరం వైఎస్సార్ సీపీకి ఎంతో ఉంది. ఇప్పటి వరకు ఈ వర్గానికి చెందిన నాయకులు పెద్దల సభలో లేకపోవడంతో జగన్.. ఇదే సామాజిక వర్గాని కి చెందని మర్రి రాజశేఖర్‌ను పంపాలని నిర్ణయించుకోవడంతో అధికార పార్టీలో హర్షం వ్యక్తమవుతుండ గా.. ప్రధాన ప్రతిపక్షంలో మాత్రం ఒకింత జంకు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు తమదే ఆధిపత్యంగా మారిన మండలిలో సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
మరోపక్క, బాబు సామాజిక వర్గానికి చెందిన వారి దూకుడు కూడా తగ్గుతోంది. ఈ క్రమంలో వైసీపీ తరఫున ఓ బలమైన నాయకుడు, సీనియర్ నేత ఇప్పుడు మండలికి పంపుతుండడంతో టీడీపీ నేతల్లో ఒకింత ఆందోళన కనిపిస్తోంది. జగన్ వ్యూహం విషయానికి వస్తే.. ఎక్కడ ఎలాంటి అడుగులు వేయాలో ఆయనకు తెలిసినంతగా నేటి తరం నాయకులకు తెలియడం లేదనేది వాస్తవం. రాజధాని మార్పు విషయంలో టీడీపీతో పాటు టీడీపీ కమ్మలు జగన్‌తో పాటు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో బురద జల్లేందుకు, డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలోనే జగన్ మర్రికి ఎమ్మెల్సీ ఇవ్వాలని తాజాగా తీసుకున్న నిర్ణయంపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిలకలూరిపేట సీటు త్యాగం చేసినందుకు జగన్ మర్రికి తాను ఇస్తానన్న మంత్రి పదవికి మార్గం సుగమం చేయడంతో పాటు జగన్ కమ్మలను తొక్కేస్తున్నాని ప్రచారం చేసే వారికి కూడా చక్కగా చెక్ పెట్టేసినట్లయ్యింది. మొత్తానికి మర్రి కి ఇన్నాళ్లకు జగన్ ఇచ్చిన హామీ నెరవేరుతున్నందుకు జిల్లాలోనూ వైసీపీ నేతలు హ్యాపీగా ఉన్నారు.