‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలను నిలువరించాలంటూ వైఎస్సార్సీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపి.. మధ్యంతర ఉత్తర్వులిచ్చే విషయమై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని, సెన్సార్ బోర్డు జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలని అప్పిరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్‌ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ఈ చిత్రంలోని పాత్రలు ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెల్యే కొడాలి నాని, తదితరులను పోలి ఉన్నాయని వైఎస్సార్సీపీని చులకన చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించారని ఆరోపించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దీన్ని నిర్మించారని.. ఈనెల 15న విడుదల కాబోతుందని.. ప్రదర్శనను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.
మరోవైపు చిత్ర నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ. చిత్రాన్ని పరిశీలించిన కమిటీ కొన్ని సన్నివేశాల తొలగింపునకు సూచించగా, తాము రివిజన్ కమిటీని ఆశ్రయించామని ఆ కమిటీ సూచించిన మేరకు కొన్ని సన్నివేశాలను తొలగించామని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చే విషయమై నిర్ణయాన్ని వాయిదా వేసింది.