భారత రెజ్లింగ్ సమాఖ్యపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూఎఫ్ఐపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందంటూ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవలే యూడబ్ల్యూడబ్ల్యూ బ్యూరో సమావేశమై రెజ్లింగ్ సమఖ్యపై విధించిన సస్పెన్షన్, ఇతర విషయాలపై చర్చలు జరిపి ఈ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. పలు షరతులతోనే ఈ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు యూడబ్ల్యూడబ్ల్యూ స్పష్టం చేసింది.
రెజ్లింగ్ సమాఖ్య అథ్లెట్ల కమిషన్‌కు ఎన్నికలు నిర్వహించాలని, ఇందులో పాల్గొనే అభ్యర్థులు క్రియాశీలక అథ్లెట్లు లేదా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి నాలుగేళ్లకు మించినవారు అయ్యుండాలని ఈ సందర్భంగా యూడబ్ల్యూడబ్ల్యూ పేర్కొంది. అంతే కాకుండా ఇందులో అథ్లెట్లే ఓటర్లుగా ఉండాలని, ఈ ఎన్నికలు ట్రయల్స్ సమయంలో లేదా ఏదైనా సీనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్ జరిగేటప్పుడు మాత్రమే నిర్వహించాలని సూచించింది. జులై 1 కంటే ముందుగానే ఈ ఎన్నికలు జరగాలని ఆదేశించింది. .దీంతో పాటు రెజ్లర్లపై వివక్ష చూపించకుండా అందరినీ ఒలింపిక్స్, ఇతర అంతర్జాతీయ ఈవెంట్లలోకి పరిగణించాలని వెల్లడించింది.