నల్గొండ సభలో కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలను కాంగ్రెస్ మంత్రులు ఖండించారు. కేసీఆర్ అన్నీ అన్నీ అసత్యాలే చెప్పారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టుపెట్టి 299 టీఎంసీల కృష్ణా జలాల వాటాకు అంగీకరించి ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రెండు నెలల తర్వాత ఎట్టకేలకు ప్రజల ముందుకు వచ్చిన కేసీఆర్ నిజాలు మాట్లాడుతారని భావించామని.. సహజ పద్ధతిలో అబద్ధాలే చెప్పారని మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే ప్రజల దృష్టిని మరల్చేందుకే నల్గొండ సభ పేరుతో నాటకాలు ఆడారని మరో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కృష్ణా జలాల అప్పగింతకు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా విధ్వంసానికి మూలకారణమైన కేసీఆర్ రెండు నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టడం దారుణమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేసీఆర్ ఇచ్చిన డైరక్షన్‌లో కిషన్‌రెడ్డి ఆదేశాలతోనే బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డకు రాలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.