భారత దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. రోజు వేల సంఖ్యలో వైద్య సిబ్బంది కరోనా వ్యాక్సిన్ అందుకుంటున్నారు. అయితే కొంతమందికి మాత్రం ఈ వ్యాక్సిన్ ప్రమాదకరంగా మారుతోంది. వ్యాక్సిన్ వేసుకున్న కొన్ని రోజులకే వారు మృత్యువాత పడుతున్నారు. తాజాగా తెలంగాణలో ఒక అంగన్వాడీ కరోనా వ్యాక్సిన్ వికటించి మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. నిమ్స్ లో చికిత్స పొందుతున్న సుశీల అనే అంగన్వాడీ టీచర్ ఈరోజు ఉదయం మరణించినట్లు సమాచారం.
ఆమె ఈనెల 19వ తేదీన మంచిర్యాల జిల్లా కాశీపెటలో వ్యాక్సిన్ తీసుకున్నారు. గత పది రోజులుగా ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ముందుగా ఆమెను జిల్లా ఆస్పత్రిలో వైద్యం అందించారు. ఎంతకూ జ్వరం తగ్గక పోవడంతో ఆమెను ఇటీవలే నిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. అయితే ఇది వ్యాక్సిన్ వికటించి జరిగిందా లేదా అనేది ఆమె పోస్టుమార్టం రిపోర్టు వచ్చినాకనే తెలియాల్సి ఉంటుంది.