నేతల పక్క చూపులతో అనంతపురం టీడీపీలో ఆందోళన

-

టీడీపీ అధినేతేమో సింపుల్ గా ఎన్నికలను బహిష్కరించారు. దానికి చాలా కారణాలే చెబుతున్నారు. కానీ గ్రౌండ్ లెవల్లో క్యాడర్ పరిస్థితి ఏంటి..ఇప్పటికే నామినేషన్లు పూర్తయ్యాయి. కనీసం విత్ డ్రాకు కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఎన్నికలు వద్దంటే.. గ్రామాల్లో బరిలో ఉన్న తెలుగుదేశం లీడర్లు డైలమాలో ఉన్నారు. ప్రచారానికి దూరంగా ఉండి.. వైసీపీ నేతల ముందు తలదించుకోలేకపోతున్నామన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి మంచి పట్టున్న అనంతపురం జిల్లాలో ద్వితీయ శ్రేణి నేతలు చేసేదేం లేక పక్క పార్టీవైపు చూస్తున్నారు.

నాలుగు దశాబ్ధాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి గతంలో ఎప్పుడూ చూడని పరిస్థితి ఎదురవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం క్యాడర్ ను విస్మయానికి గురి చేసింది. అంతే కాదు పోటీలో ఉన్న అభ్యర్థులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సహజంగా ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఈ నిర్ణయం తీసుకుంటే క్యాడర్ కొంత వరకు సమర్థించేది. కానీ ఇప్పుడు నడిసంద్రంలో ఉన్నప్పుడు వెనక్కు రమ్మంటే ఎలా అనే అభిప్రాయం పోటీలో ఉన్న అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో క్యాడర్ ఆవేదన ఇది.

ప్రస్తుతం టీడీపీ అభ్యర్థుల ముందు ఉన్న ప్రశ్న ఒక్కటే. తాము ప్రచారం చేయాలా వద్దా ఒకవేళ చేయకపోతే… తమనే నమ్ముకుని వెంట తిరిగిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలి.. సింబల్ కనిపిస్తే చాలు ఓటు వేసే వారికి ఓటు వేయద్దని చెప్పాలా.. అన్నిటికీ మించి ఎన్నికలకు ముందే పలాయనం చిత్తగించామన్న అవమానాలను ఎలా ఎదుర్కోవాలి. దీనికి ఎవరు సమాధానం చెబుతారు. సింపుల్ గా ఎన్నికలను బహిష్కరించామని చెప్పినా రేపు మమ్మల్ని నమ్మి వచ్చిన వారు ఉంటారా అని వారిలో వారే మదనపడిపోతున్నారు. దీనికి తోడు వరుసగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘెర పరాభవం ఎదురు కావడంతో చాలా మంది కీలక నేతలు చేజారిపోతున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

అనంతపురం జిల్లాలో 63 జెడ్పీటీసీ స్థానాలుండగా చిలమత్తూరు జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి వినోదమ్మ మరణించడంతో 62 స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. 841 ఎంపీటీసీ స్థానాలుండగా 49 స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. టీడీపీ ఖాతాలో ఒక ఎంపీటీసీ స్థానం పడింది. కొందరు అభ్యర్థులు మరణించడంతో 784 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయంతో ఇప్పటికే బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థుల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత అధికార పార్టీలోకి వలసలు సైతం పెరిగాయి.

పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్ధులు ముకుమ్మడిగా అధికార వైసీపీలో చేరారు. టీడీపీ నిర్ణయం కారణంగా అనంతపురం రూరల్ అభ్యర్ధులు సైతం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ప్రస్తుతం అధినేత తీసుకున్న నిర్ణయం పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నా ఎన్నికల లోపు జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version