నైరుతి రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి. సాధారణం కన్నా రెండు రోజులు ముందుగానే దేశంలోకి ప్రవేశించిన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి మాత్రం ఇంకా ప్రవేశించలేదు. అనుకున్న దాని కన్నా ఆలస్యంగా రుతుపవనాలు ఏపీ, తెలంగాణల్లోకి విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు రేపు సోమవారం ( జూన్13) రోజున తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం నాటికి గోవా, కొంకణ్, కర్ణాటకల్లో కొంతమేర రుతుపవనాలు విస్తరించాయి. శనివారం మహారాష్ట్రలోని ముంబైలోకి రుతుపవనాలు విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. ఇదిలా ఉంటే పశ్చిమ భారత్ నుంచి తక్కవ ఎత్తులో గాలులు వీస్తుండటం వల్ల ఆది, సోమవారాల్లో తెలంగాలణలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. జూన్ నెల ప్రారంభం అయి రెండు వారాలు గడుస్తున్నా.. ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటులున్నాయి. ఇదిలా ఉంటే ఇందుకు విరుద్ధంగా మరికొన్ని ప్రాంతాల్లో మబ్బులతో చల్లని వాతావరణం కనిపిస్తోంది.