కోవర్టుల పై ఏపీ బీజేపీ వ్యూహం బూమరాంగ్…?

-

కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఉడినట్టుగా ఉంది ఏపీ బీజేపీ మీడియా ప్రతినిధుల జాబితా. పార్టీ తరఫున టీవీ చర్చల్లో వీళ్లే పాల్గొనాలి వీరినే మీడియా పిలవాలంటూ ఓ జాబితా ఇచ్చింది బీజేపీ. అందులో అధికార ప్రతినిధులతో సహా వివిధ పదవుల్లో ఉన్న 28 మందికి చోటు కల్పించారు. ఈ జాబితాలో ఉన్న వారి సంగతి ఏమోకానీ గట్టిగా మాట్లాడగలం, పార్టీ గొంతు వినిపించగలం అనుకున్న వాళ్లు కుతకుతలాడిపోతున్నారట. అలాగే కొంతమంది నేతల పేర్లపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయట.

బీజేపీ ఓ కొత్త ప్రయోగానికి తెర తీసింది. అధికార ప్రతినిధులతోపాటు మరికొందరితో ఓ జాబితా తయారు చేసి.. మా పార్టీ తరఫున వీళ్లను మాత్రమే టీవీ చర్చలకు పిలవాలని షరతు పెట్టింది. ఇదే ఇప్పుడు ఏపీ బీజేపీలో రచ్చ రచ్చ అవుతోంది.పార్టీ పేరుతో చర్చలకు వెళ్తున్న సదరు నేతలు వేరే పార్టీ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని, వారికి అనుకూలంగా వాయిస్ వినిపిస్తున్నారని గుర్తించారట. అలాంటి వాళ్లకు కత్తెర వేయడానికి ఈ అధికార ప్రతినిధుల జాబితాను అధికారికంగా విడుదల చేశారట.

కోవర్టులు ఎవరో ఏంటో తెలియదు కానీ… ఎప్పటి నుంచో పార్టీ ప్రతినిధులుగా మీడియా చర్చలకు వెళ్తున్న రమేష్ నాయుడు, పాతూరి నాగభూషణం, రఘురాం వంటి వారి పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు. ఇది అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాగే కోవర్టులుగా పార్టీ అనుమానిస్తున్న ఒకరిద్దరు పేర్లూ జాబితాలో ఉన్నాయట. ఇదే గందరగోళానికి తెర తీసింది. అంతేకాదు… ఫీల్డ్ లో పని చేసే చాలా మంది పేర్లు జాబితాలో లేకపోవడంతో పని చేసేది మేము టీవీల్లో కనిపించేది వాళ్లా? అంటూ పెదవి విరుస్తున్నారట. మొత్తానికి బీజేపీ నేతలు చేసిన ఈ పని…. ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకున్న చందంగా మారిందని అంటున్నారు. దీన్ని ఎలా సరి చేస్తారో… అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version