ఇటీవల టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ పార్టీ ఇంచార్జీ గౌతు శిరీషకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. అయితే మరోమారు గౌతు శిరీషకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 20న గుంటూరులోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో సీఐడీ అధికారులు ఆమెను ఆదేశించారు. ఐటీ చట్టం కింద నమోదు చేసిన కేసు విచారణలో భాగంగా దర్యాప్తునకు సహకరించాలని ఆ నోటీసుల్లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే… ఇదే కేసులో నాలుగు రోజుల క్రితం సీఐడీ విచారణకు గౌతు శిరీష హాజరైన సంగతి తెలిసిందే. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలోని సీఐడీ విభాగంలో ఆమెను దాదాపుగా 7 గంటల పాటు సీఐడీ అధికారులు విచారించారు. ఈ విచారణ సందర్భంగా అధికారులు తనకు మధ్యాహ్న భోజనం పెట్టలేదని, కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని శిరీష ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నేరం ఒప్పుకుంటున్నట్లు తనతో సంతకం చేయించేందుకు సీఐడీ అధికారులు యత్నించారని, అయితే తాను మాత్రం అందుకు ఒప్పుకోలేదని శిరీష పేర్కొన్నారు.