బ్యాంకుల రుణాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టుల పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ), ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకులు ఇచ్చిన రుణ సాయంతో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై సీఎం ఇవాళ ఉన్నతాధికారులతో సమీక్షించారు. మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రూ.25,497 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం వివరించారు.
కరవు ప్రాంతాల్లో కాలువల ద్వారా చెరువులను అనుసంధానం చేయాలని అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. అవసరమైన చోట్ల కొత్తగా చెరువులను తవ్వాలని.. ప్రపంచ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థల సాయంతో వీటిని అమలు చేయాలని నిర్దేశించారు.
చెరువుల్లోకి గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాలువలతో అనుసంధానం చేయటం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని.. పర్యావరణ సమతుల్యత కూడా ఉంటుందని జగన్ అన్నారు. పనులు పూర్తి చేయకుండా వదిలేసిన బ్రిడ్జ్‌లు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో పోర్టులు నిర్మించడం ద్వారా వీటి చుట్టు పక్కల ప్రాంతాల్లో అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.