ఏపీలో విపరీతంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓ వైపు వడగాలులు, మరో వైపు ఉక్కపోతలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో విద్యుత్ కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే డొమెస్టిక్ వినియోగదారులు అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడుతున్నారు.
కాగా.. విపరీతమైన డిమాండ్ కారణంగా పరిశ్రమలకు విద్యుత్ కోతలు ప్రకటించినా లోడ్ సర్దుబాటు కావడం లేదు. దీంతో పరిశ్రమలకు విద్యుత్ విరామాన్ని ఈనెల 15 వరకు పొడగిస్తూ డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలా ఉంటే విద్యుత్ కోతలతో చాలా నష్టపోతున్నామని పరిశ్రమల వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా చాలా వరకు లాక్ డౌన్లతో పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఆసమయంలో చాలా వరకు నష్టపోయామని… ప్రస్తుతం మళ్లీ విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. తాజాగా మరో 15 రోజులు విద్యుత్ విరామాన్ని పొడగించడంతో తమకు ఇబ్బందులు తప్పవని పరిశ్రమవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.