పట్టణాల్లో మధ్య ఆదాయ వర్గాల(ఎంఐజీ) వారి కోసం ప్రారంభించిన జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లకు స్పందన కొరవడింది. ఈ స్కీమ్ ను ప్రజలు ఉపయోగించుకునేలా వారిని ఆకర్షించడానికి ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..?
జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లకు స్పందన కొరవడటంతో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్లాట్‌లో 60% భూమి విలువపైనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కు సంబంధించిన కొన్ని లేఅవుట్లలో స్థలాల కొనుగోలుకు ప్రజలు ముందుకు రాకపోవడంతో కొనుగోలుదారులను ఆకర్షించడానికి తీసుకున్న తాజా నిర్ణయాన్ని జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లకూ వర్తింపజేసింది.
దీని ప్రకారం.. ప్లాట్ మొత్తం విస్తీర్ణాన్ని రెండుగా విభజించనున్నారు. ఇందులో 60% ప్రాంతాన్ని అమ్మకపు ధరగా నిర్ణయిస్తారు. మిగతా 40% ప్రాంతాన్ని అభివృద్ధి ధరగా చూపిస్తారు. 60% అమ్మకపు ధరకే రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాలి. 40% అభివృద్ధి ధరపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండవు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో ఎంఐజీ ప్లాట్ల ధరను ఇప్పటికే జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయించినందున.. వాటి విస్తీర్ణాన్ని రెండుగా విభజించేలా తదుపరి చర్యలు తీసుకోవాలని పట్టణాభివృద్ధి సంస్థలను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆదేశించింది.