ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రాష్ట్ర ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా ఆయనను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టీడీపీ హయాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ఏబి వెంకటేశ్వరరావు నిఘా పరికరాల కొనుగోలు లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
తనను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు విజయం సాధించిన సంగతి తెలిసిందే. సివిల్ సర్వీసెస్ అధికారులను రెండేళ్లకు మించి సస్పెన్షన్లో ఉంచరాదన్న నిబంధనలను ప్రస్తావించిన సుప్రీంకోర్టు తక్షణమే ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలంటూ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే ఏపీ ప్రభుత్వం తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు కి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.