తితిలీ తుపాను బాధితుల‌కు ప‌రిహారం అంద‌జేత‌

-


ప‌వ‌న్‌, జ‌గ‌న్ పై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు
బిజేపీ వైఖ‌రిపై మండిపాటు

తితిలీ తుపాను ఉద్దాన ప్రజల్లో ఉక్కు సంకల్పాన్ని నింపిందని సీఎం చంద్రబాబు చెప్పారు. తితలీ తుపాను తనకు కొత్త అనుభవాన్ని నేర్పిందని ఆయన తెలిపారు. తితిలీ బాధితుల‌కు సీఎం చంద్ర‌బాబు సోమ‌వారం ప‌రిహారం పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లాస‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. లోపాలను సరిదిద్దుకొని భవిష్యత్‌లో సమర్థంగా పనిచేస్తామన్నారు. ప్రజలు అధైర్య పడాల్సిన పనిలేదని, ఉద్దానానికి పూర్వవైభవం తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చారు. తితలీ తుపాను భయకరమైన వాతావరణాన్ని సృష్టించిందని, అధికారుల అప్రమత్తతతో ప్రాణనష్టం తగ్గించగలిగామని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలంటే ఎక్కువగా అధికారులు సహాయ చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. మంత్రులు, అధికారుల పనితీరు అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు. దసరా పండుగ తుపాను బాధితుల మధ్యే గడిపారని తెలిపారు.

“ప్రజా సమస్యలకంటే పండుగలు ప్రభుత్వానికి ఎక్కువ కాదు. సరైన సమయంలో సాయం అందజేస్తేనే ప్రజలకు ప్రయోజనం. తితలీ తుపానుతో నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తాం. హెక్టారుకు రూ.40వేల సాయం చేస్తున్నాం. కేంద్రం సహకరించకపోయినా తుపాను బాధితులకు న్యాయం చేశాం. తప్పుడు సమాచారంతో పరిహారం కాజేయాలని చూస్తే ఖబడ్దార్‌. ప్రభుత్వాన్ని మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు. ఉద్దానం ప్రాంతంలో శాశ్వత గృహాలు కట్టిస్తాం. కోడి కత్తి వ్యవహారంలో ఢిల్లీలో నానా హడావుడి చేశారు. తితలీ బాధితుల సాయం కావాలని ఢిల్లీ నేతలను ఒక్క మాట అడగరు. కేంద్రానికి మానవత్వం లేదు, తుపాను బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. పార్టీ ఆఫీసు శంకుస్థాపనకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌కు సమయం ఉంటుంది. కష్టాల్లో ఉండాల్సిన ప్రజలను చూడాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? కేంద్ర ప్రభుత్వ తీరును దేశవ్యాప్తంగా తిరిగి ఎండగడతాం” అని చంద్రబాబు హెచ్చరించారు.

వైసీపీకి సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ఆటలు తన దగ్గర సాగవని హెచ్చరించారు. పక్క జిల్లాలో ఉండి కూడా తుపాను బాధితులను ప్రతిపక్ష నేత జగన్‌ పరామర్శించలేదని ఆరోపించారు. వైసీపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడ్డారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఉద్దానంపై ప్రేమ ఉందని చెప్పే జనసేన అధినేత పవన్‌ కేంద్రానికి లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. కేంద్ర పెద్దలు దేశాన్ని భ్రష్టుపట్టించారని, దేశంలో రాజకీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తామని స్పష్టం చేశారు. బీజేపీ అరాచకపాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్‌ సహకారం కోరామని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా హక్కుల కోసం పోరాటం ఆగదని చంద్రబాబు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version