వైసీపీకి చెందిన బందరు ఎంపీ వల్లభనేని శౌరికి ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన ఆధ్వర్యంలో పని చేసే కినెటా పవర్ ప్రాజెక్ట్స్ కి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం, మోమిడి గ్రామంలో ఆ సంస్థకు అప్పగించిన 840 ఎకరాల భూమిని వెనక్కు తీసుకోవాల్సిందిగా ఏపీఐఐసీని ఆదేశించింది ప్రభుత్వం.
1980 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం కినేటా పవర్ ప్రాజెక్ట్సు లిమిటెడ్ కు ప్రభుత్వం భూమి అప్పగించింది. రూ. 2,997 కోట్ల వ్యయంతో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో 2009, 2012లలో కినేటా పవర్ ప్రాజెక్టు లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. మూడు దఫాలుగా నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో కినేటా సంస్థ నుంచి 840 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఏపీఐఐసీని ప్రభుత్వం ఆదేశించింది.