ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో ధాన్యం కొనుగోలు కి సంబంధించి ఏపీ సర్కార్ దూకుడు పెంచింది. ధాన్యం అమ్మకాలు ఏ విధంగా చేపట్టాలి అనే దాని మీద మార్గదర్శకాలు విడుదల చేసింది. మధ్య దళారీల వల్ల రైతులు మోసపోకుండా కనీస మద్దతు ధర గ్రామ స్థాయిలోనే వారికి తెలిసేలా ప్రత్యేక చర్యలు చేపదుతున్నామని చెప్పింది. మద్దతు ధరపై జిల్లా స్థాయిలో జేసీలు, వ్యవసాయ శాఖ జేడీ, జిల్లా మేనేజర్లు, డీఎస్ఓలకు సివిల్ సప్లయిస్ ఎక్స్ అఫీషియో సెక్రటరీ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేసారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి ప్రకటించిన మద్దతు ధర : సాధారణ రకం క్వింటాలుకు రూ.1815, గ్రేడ్-ఎ రకం రూ.1835.- గ్రామం వారీగా రోజూ వరి కోతలు, ధాన్యం అమ్మకాల్ని పర్యవేక్షిస్తూ కనీస మద్దతు ధర అందేలా చర్యలు, పొలం నుంచి సేకరించిన ధాన్యాన్ని నిర్ణీత రైస్ మిల్లులకు రవాణా చేసేందుకు జీపీఎస్ ఉన్న వాహనాలు సిద్ధం చేసుకోవాలి. GPS ట్రాకర్ ద్వారా సదరు ధాన్యం నిర్దేశించిన మిల్లుకు చేరిందో లేదో నిర్ధారించుకోవాలి
ధాన్యం కొనుగోళ్ళలో సమస్యల ఎదురైతే రైతులు టోల్ ఫ్రీ నెంబర్ 1902కు కంప్లైంట్ చేయాలి. రైతుకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ధాన్య సేకరణను వేర్వేరు చోట్లకు వికేంద్రీకరించాలి. వికేంద్రీకరణకు వీలుగా గ్రామ సచివాలయ స్థాయిలో గ్రామ వ్యవసాయ సహాయకులు (VAA) రైతుల పూర్తి వివరాల్ని రిజిస్టర్ చేయాలి. తమ రిజిస్ట్రేషన్ కోసం రైతులు తమ ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నెంబర్, బ్యాంకు పాస్ బుక్, పట్టాదారు పాస్ బుక్ వివరాలు ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ పూర్తైన రైతుల పేర్ల జాబితాను గ్రామ సచివాలయంలో ప్రదర్శించాలి.
రైతు, కౌలు రైతు పేరు ‘ఈ-పంట’లో నమోదు కాకపోతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆ వివరాలను VAAలు మండల వ్యవసాయ అధికారి ద్వారా నమోదు చేయించాలి. కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్మినట్లు, దళారీలు దోచుకున్నట్లు తెలిస్తే VAAలు మండల వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లాలి. గ్రామ సచివాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ 1902 ధాన్య సేకరణ విధానాన్ని వివరించే పోస్టర్‌ను ప్రదర్శించాలి. “జనధన్” ఖాతా ఉన్న రైతులకు గరిష్టంగా రూ.50 వేలు మాత్రమే జమ చేసేందుకు వీలు. ధాన్యం సేకరణకు సంబంధించిన యంత్రాలు, ఇతర అవసరమైన సామగ్రిని మార్కెటింగ్ శాఖ సమకూర్చాలి.