ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొత్త పాలసీకి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఇసుక రీచ్ లను మూడు ప్యాకేజ్ లు గా విభజించింది. మొన్న జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ ఇసుక కొత్త పాలసీకి ఆమోదం లభించడంతో ఇప్పుడు దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్యాకేజీ 1 పరిధిలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లా ఉండనుంది. ఇక ప్యాకేజీ 2 పరిధిలో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఉండనున్నాయి.
ఇక మూడో ప్యాకేజ్ విషయానికి వస్తే నెల్లూరు సహా రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఉండనున్నాయి. ఈ ప్యాకేజీల వారీగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒక వేళ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకు రాకుంటే మాత్రం బిడ్డింగ్ ద్వారా ఈ మూడు ప్యాకేజ్ లని ప్రైవేటు సంస్థలకి అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టెక్నికల్, కమర్షియల్ బిడ్ల ద్వారా ప్రైవేటు సంస్థలను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాల్టా చట్టానికి లోబడి ఇసుక తవ్వకాలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది.