అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి మరో ముహూర్తం ఫిక్స్ !

-

ఎన్నో మార్లు వాయిదా పడుతూ వచ్చిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం అక్టోబర్ 6న జరగనుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర జలవనరుల శాఖ సమాచారం పంపింది. ఆగస్టు 25న జరగాల్సిన అపెక్స్ సమావేశం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ కు కరోనా రావడంతో వాయిదా పడింది. ఈ సమావేశంలో అంతర్ రాష్ట్ర జల వివాదాలపై తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ లు చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్నారు.

ఈ భేటీలో ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులు, వాటి డీపీఆర్‌లు, బోర్డుల పరిధి వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ సమావేశం ఆగస్టు 5న జరగాల్సి ఉంది. అదే రోజున తమకు అత్యంత ముఖ్యమైన సమావేశం, కేబినెట్ భేటీ ఉన్నందున ఆ రోజు కుదరదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరోసారి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం ఆగస్టు 25వ తేదీని ఫిక్స్ చేసింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ కు కరోనా రావడంతో అది వాయిదా పడి ఇప్పుడు అక్టోబర్ 6న జరగనుంది. 2016 ఆగస్టులో సీఎం కేసీఆర్‌, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో నాటి కేంద్రమంత్రి ఉమాభారతి నేతృత్వంలో అపెక్స్‌ కమిటీ సమావేశం జరగ్గా ఇది రెండోసారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version