సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ తన ఐఫోన్ 8 అమ్మకాలను భారత్‌లో నిలిపివేసింది. సాధారణంగా ఆపిల్ కొత్త ఐఫోన్లను విడుదల చేస్తే.. పాత ఐఫోన్ల ధరలను తగ్గించడంతోపాటు.. పలు పాత ఐఫోన్ల అమ్మకాలను కొంత కాలం పాటు నిలిపివేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఐఫోన్ ఎస్ఈ 2020 ని విడుదల చేయడంతో.. ఐఫోన్ 8 అమ్మకాలను ఆపిల్ నిలిపివేసింది. అయితే ఈ అమ్మకాలను కేవలం భారత్‌లోనే ఆపిల్ నిలిపివేయడం గమనార్హం.
ఆపిల్ తన వెబ్‌సైట్‌లో ఐఫోన్ 8కు గాను ‘బై (Buy)’ అనే ఆప్షన్‌ను తీసేసింది. దీంతో ఆ ఫోన్ అమ్మకాలను ఆపిల్ నిలిపివేసినట్లయింది. ఇక ఈ-కామర్స్ సంస్థలు ఏప్రిల్ 20వ తేదీ నుంచి దేశంలో తిరిగి యథావిధిగా తమ కార్యకలాపాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఐఫోన్ 8ను ఆ సంస్థలు అమ్ముతాయో, లేదో చూడాలి. అయితే ఐఫోన్ ఎస్ఈ 2020 కి, ఐఫోన్ 8 కి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఐఫోన్ 8 ప్రారంభ ధర రూ.34వేల వరకు ఉండగా.. ఐఫోన్ ఎస్ఈ 2020 ప్రారంభ ధర రూ.42వేలుగా ఉంది. రెండింటి ధరల్లోనూ కొంత వరకు వ్యత్యాసం ఉన్నప్పటికీ వినియోగదారులు ఐఫోన్ 8 నే కొనుగోలు చేస్తారని.. అందుకనే ఆ ఫోన్ అమ్మకాలను నిలిపివేస్తే.. కొత్త ఐఫోన్‌ను వారు కొంటారని.. అందుకనే ఆపిల్ ఐఫోన్ 8 అమ్మకాలను భారత్‌లో నిలిపివేసి ఉంటుందని.. పలువురు భావిస్తున్నారు.
ఇక ఐఫోన్ ఎస్ఈ 2020లో ఆపిల్ ఎ13 బయానిక్ ప్రాసెసర్ ఉండడంతో చాలా మంది వినియోగదారులు ఈ ఫోన్‌లోనే ఐఫోన్ 11కు సమానంగా వేగాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఐఫోన్ ఎస్ఈ 2020ని వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తారని ఆపిల్ భావిస్తోంది.