మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఏపీ టీడీపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర సమస్య పరిష్కారం కోసం టీడీపీ నేటి నుంచి చేపట్టనున్న పోరుబాటకు బయలుదేరుతున్న పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై తీవ్రంగా స్పందించారు. ఉత్తరాంధ్ర పోరుబాటకు బయలుదేరుతున్న బుద్ధా వెంకన్న, గౌతు శిరీష వంటి నేతలను పోలీసులు నిర్బంధించారు. దీనిపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండ్ కో ఉత్తరాంధ్రను అడ్డంగా దోచుకుంటున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ఆ దోపిడీ వ్యవహారాలు బయటపడిపోతాయనే తమ పోరుబాట కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు అచ్చెన్నాయుడు. ఉత్తరాంధ్రలో జె-గ్యాంగ్ దోపిడీని బయటపెట్టేందుకు బయలుదేరిన తమ నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో జగన్ రెడ్డి అణచివేయించే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ ఉత్తరాంధ్ర పోరుబాటును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అచ్చెన్నాయుడు.