గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. చంద్రబాబును ఎమ్మెల్యే వంశీ విమర్శించడంతో రగడ మొదలైంది. వంశీపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీపై అదేస్థాయిలో విమర్శలు గుప్పించారు. దాంతో, మా నాయకుడినే విమర్శిస్తారా అంటూ వంశీ అనుచరులు మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. టీడీపీ కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఆఫీసు ఆవరణలో ఉన్న కారుకు నిప్పంటించారు.
ఇదిలా ఉంటే.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేసి విధ్వంసం సృష్టించడంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. ఎమ్మెల్యే వంశీ కనుసన్నల్లోనే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని ఆరోపించారు. వైసీపీ రౌడీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి రౌడీ పాలనకు పరాకాష్ఠ అని అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.