జగిత్యాల జిల్లాలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్. “రోజురోజుకు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతతో, అసహనానికి గురవుతున్న అరాచకపు కుటుంబ నాయకత్వం మరియు వారి శ్రేణులు బిజెపి పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారి పై పథకం ప్రకారం దాడులకు దిగడం చాలా హేయమైన చర్య. దీన్ని ప్రజాస్వామిక వాదులు గమనించాలి. కెసిఆర్ ప్రభుత్వంపై ప్రజలు ముక్తకంఠంతో తిరగబడే రోజులు ఆసన్నమయ్యాయి.
ఎంపీ అరవింద్ గారి పై దాడిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే దీటుగా సమాధానం చెప్పేందుకు బిజెపి శ్రేణులు సిద్ధంగా ఉన్నారు.గల్లి నుండి రాష్ట్ర రాజధాని వరకు టిఆర్ఎస్ నాయకులు వారి అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలకు ఇది పరాకాష్ట. వీరికి అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మారుతుండడం ప్రతిరోజు మనం క్షేత్రస్థాయిలో చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రతి సామాన్యుడు బాధితుడుగా మారిన సందర్భం రాష్ట్రమంతా నెలకొంది. ఈ అరాచకపు చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారు”. అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు .