ఆసీస్ స్టార్ మహిళా క్రికెటర్ ఎలిస్ పెర్రీ, తన భర్త మ్యాట్ టుమువా.. తమ ఐదేళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పేశారు. వీరిద్దరూ 2015 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. పెర్రీ క్రికెటర్‌గా రాణిస్తుండగా.. టుమువా మెల్బోర్న్ రెబల్స్ జట్టు తరఫున ప్రొఫెషనల్ రగ్బీ ప్లేయర్‌గా ఉన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై నోరు మెదపని ఈ జంట.. ఆదివారం అనూహ్యంగా సోషల్‌మీడియా వేదికగా ప్రకటన చేశారు.
“ఇద్దరం ఒకరి భావాలను మరొకరు గౌరవించుకొని విడిపోదామని ఈ ఏడాది ఆరంభంలోనే నిశ్చయించుకున్నాం. విడిగా జీవించేందుకు ఇదే సరైన నిర్ణయమని అనిపిస్తోంది. ఇద్దరికీ వేర్వేరు జీవితాలు, లక్ష్యాలు ఉన్నాయి. అందుకే ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా కష్టమైన సమయం” అని చెప్పుకొచ్చారు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డులకు వెడ్డింగ్ రింగ్ లేకుండా పెర్రీ హాజరవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ వేడుకలో ఈ అమ్మడు మూడోసారి బెలిండా క్లార్క్ అవార్డు అందుకుంది. ఫిబ్రవరి-మార్చిలో జరిగిన మహిళల ట20 ప్రపంచకప్‌లో చివరిగా కనువిందు చేసింది పెర్రీ. టోర్నీ ఆద్యంతం అద్భుతంగా ఆడినా.. గాయం కారణంగా ఫైనల్‌కు దూరమైంది.