ఇలా జరిగిందేంటీ.. ఆసీస్‌ చేతిలో ఓడిన టీమిండియా జట్టు..

-

ఎంతో ఈజీగా గెలుస్తారనుకున్న మ్యాచ్‌లో టీమిండియా ఓడింది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న కామన్వెల్త్ గేమ్స్ లో టీమిండియా అమ్మాయిలు అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నారు. 155 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ఓ దశలో 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకోగా, పట్టుబిగించాల్సిన టీమిండియా ఉదాసీనంగా వ్యవహరించింది. ఆపై, అందుకు తగిన మూల్యం చెల్లించింది. టీమిండియా పట్టుసడలించడంతో ఆసీస్ రెచ్చిపోయింది. దాంతో ఆ జట్టు 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి విజయవంతంగా లక్ష్యఛేదన పూర్తిచేసింది. లోయర్ ఆర్డర్ లో ఆష్లే గార్డనర్ 35 బంతుల్లో 9 ఫోర్లతో 52 పరుగులు చేయగా, గ్రేస్ హ్యారిస్ 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 37 పరుగులు చేసింది.

ఆఖర్లో అలానా కింగ్ 16 బంతుల్లో 18 పరుగులు చేసి విన్నింగ్ షాట్ కొట్టింది. ఓడిపోవాల్సిన మ్యాచ్ ను ఆసీస్ అద్భుతరీతిలో కైవసం చేసుకుంది. దాంతో టీమిండియాకు తీవ్ర నిరాశ మిగిలింది. టీమిండియా బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు, దీప్తి శర్మ 2, మేఘనా సింగ్ 1 వికెట్ తీశారు. మోహరింపులు చేయడంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ విఫలమైనట్టు మ్యాచ్ తీరుతెన్నులు గమనిస్తే అర్థమవుతోంది. దాంతో ఆసీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు యధేచ్ఛగా షాట్లు కొట్టగలిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version