రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….అలవికాని హామీలిచ్చి.. అరచేతిలో వైకుంఠం చూపించి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు.
ఇష్టమొచ్చిన మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ అయినా అమలు చేసిందా? అని కేసిఆర్ ప్రశ్నించారు. మహిళలకు రూ.2500, రైతులకు 2 లక్షల రుణమాఫీ.. ఇలా ఏ ఒక్క హామీ అమలు కాలేదని మండిపడ్డారు. ఒకే ఒక్క మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ పెట్టారు.. దాంతో బస్సుల్లో ఆడవాళ్లు సర్కాస్ చేసినట్టు తన్నుకుంటున్నారని. ఆటో డ్రైవర్లు అన్నమో రామచంద్రా అని ఏడుస్తున్నారని కేసిఆర్ అన్నారు.మొత్తం రైతాంగాన్ని కాంగ్రెస్ వంచించిందని కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతుబంధు రాలేదు.. నీళ్లు రాలేదు.. కరెంటు రాలేదు.. మరమగ్గాలు మూలపడే పరిస్థితి, చేనేత కార్మికులు చచ్చిపోయే పరిస్థితి.. ఇలా ఎవర్నీ ఆదుకున్న పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.