రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలు అరెస్ట్ అవుతారనే ప్రచారం సంచలనం సృష్టిస్తుంది..అది కూడా అధికార పార్టీకి చెందిన నేతలు…అందులోనూ రెండు రాష్ట్రాల సీఎంల కుటుంబ సభ్యులు. ఇంతకాలం అధికార పార్టీలు ప్రతిపక్షాలనే టార్గెట్ చేస్తూ రాజకీయం చేశాయి. ప్రతిపక్షాలని అణిచివేయడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సీన్ మారుతూ వస్తుంది. కొన్ని కేసులు అధికార పార్టీలనే చుట్టుకున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ సిఎం కేసిఆర్ కుమార్తె కవిత పేరు రాగా, ఇటు వైఎస్ వివేకా హత్య కేసులో ఏపీ సిఎం జగన్ సోదరుడు, ఎంపీ అవినాష్ రెడ్డి పేరు వచ్చింది. మొదట కవిత గురించి మాట్లాడుకుంటే..ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. ఈడీ రిపోర్టులో కూడా ఆమె పేరు వచ్చింది. అలాగే ఆమె సన్నిహితులు అరెస్ట్ అయ్యారు. వారు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా కవిత పేరు ఉండటంతో ఈడీ ఆమెని విచారించడానికి సిద్ధమవుతుంది.
ఇప్పటికే ఆమెని సిబిఐ ఒకసారి విచారించింది. ఇప్పుడు ఈడీ విచారించనుంది. ఈ నేపథ్యంలో ఆమె అరెస్ట్ ఖాయమని ప్రచారం జరుగుతుంది. కేసిఆర్ సైతం మహా అయితే కవితని అరెస్ట్ చేస్తారు..జైల్లో పెడతారు..అంతకంటే ఏమి చేయలేరంటూ మాట్లాడుతున్నారు. అంటే కవిత అరెస్ట్ ఖాయమని చెప్పవచ్చు. ఇటు వివేకా హత్య కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా, ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ రెండుసార్లు విచారించింది. తాజాగా మరోసారి విచారణ చేసింది.
ఇదే క్రమంలో తనని అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. దీంతో సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మార్చి 14న సిబిఐ ముందు అవినాష్ హాజరు కావాలని సూచించింది. అయితే అప్పుడైనా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయక తప్పదని తెలుస్తోంది. తాజా విచారణ సమయంలోనే ఆయన్ని అరెస్ట్ చేయాలని అనుకుందని, కానీ కోర్టు ఆదేశాలతో అరెస్టుకు బ్రేక్ పడిందని తెలుస్తోంది. మొత్తానికి అటు అవినాష్, ఇటు కవిత అరెస్ట్ ఖాయమని అంటున్నారు.