ఒమిక్రాన్ పేరుతో మందు పంపిణీ చేస్తోన్న ఆనందయ్యపై ఆయుష్ శాఖ సీరియస్ అయింది. ఈ మేరకు ఒమిక్రాన్ మందు అంటూ పంపిణీ చేస్తోన్న ఆనందయ్యకు నోటీసులు జారీ చేసింది ఆయుష్. ఒమిక్రాన్ పేరుతో పంపిణీ చేస్తోన్న మందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది ఆయుష్. ఒమిక్రాన్‌కు మందు అంటూ ఆనందయ్య పంపిణీ చేస్తోన్న మందుకు ఎలాంటి అనుమతి లేదని.. అనుమతి లేకుండా పంపిణీ ఎలా చేస్తారంటూ నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు ఆయుష్ కమిషనర్ రాములు.
ఒమిక్రాన్ మందులో ఏమేం పదార్థాలు వాడుతున్నారో చెప్పాల్సిందిగా నోటీసుల్లో స్పష్టం చేశామని.. నోటీసులకు ఆనందయ్య ఇచ్చిన సమాధానం బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఒమిక్రాన్ మందులో వాడే పదార్దాలు పరిశీలిస్తాం… 48 గంటల్లో ఒమిక్రాన్‌ను తగ్గిస్తానంటూ ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో ఆనందయ్య తయారు చేసిన మందుకు ఇప్పటి వరకు లైసెన్స్ తీసుకోలేదని.. లైసెన్స్ కోసం యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తీసుకున్నారు కానీ.. ఇప్పటి వరకు అప్లికేషన్ పెట్టలేదని చెప్పారు. ఆనందయ్య అప్లికేషన్ పెడితేనే లైసెన్స్ లభిస్తుందని.. కరోనా పేరుతో.. ఒమిక్రాన్ పేరుతో అనుమతి లేని మందులను వాడొద్దన్నారు. ఆయుష్ శాఖ ఇమ్యూనిటీ బూస్టర్స్‌ను ఉచితంగా పంపిణీ చేస్తోందని.. వేల రూపాయలు పోసి ఎవ్వరూ అనుమతి లేని మందులను కొనుగోలు చేయొద్దని పేర్కొన్నారు.