కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం అల్ల కల్లోలం సృష్టించింది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు.. కరోనా వైరాస్ యావత్ మానవాళికి ఎన్నో కొత్త విషయాలను నేర్పించింది. ఆరోగ్యం నుంచి జీవనశైలి వరకు అన్నింటిలో మార్పులకు కారణమైందీ కంటికి కనిపించని ఈ వైరస్. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన ప్రారంభంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. గర్భవతిగా ఉన్న మహిళ జన్మనిచ్చే బిడ్డకు కరోనా వస్తుందా.? ఆ తల్లి బిడ్డకు పాలివ్వొచ్చా లాంటి అంశాలు చర్చకు దారి తీశాయి.
అయితే కరోనా వైరస్‌ని అంతమొందించేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న ఓ సంఘటన వైద్యులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. గర్భవతిగా ఉన్న ఓ మహిళ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంది. దీంతో ఆ తల్లికి జన్మించిన చిన్నారి శరీరంలో పుట్టుకతోనే యాంటీ బాడీలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ మహిళ ఫ్లోరిడాలో హెల్త్ వర్కర్‌గా పనిచేస్తోంది. కరోనా యాంటీబాడీలతో పుట్టిన పిల్లాడిలో ఈ వైరస్ ప్రభావం ఎంత వరకు ఉంటుందనే విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ తరుణంలోనే మోడెర్నా వ్యాక్సిన్‌ను సదరు మహిళలకు బిడ్డకు జన్మనిచ్చే మూడు వారాల ముందు ఇచ్చారు. ఆ సమయానికి ఆమె 36 వారాల గర్భిణి. జనవరి నెలలో జన్మించిన ఈ చిన్నారి రక్తాన్ని పరిశీలించగా యాంటీబాడీలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇలా అప్పుడే పుట్టిన చిన్నారిలో యాంటీ బాడీలు గుర్తించడం ప్రపంచంలో ఇదే తొలిసారని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ యాంటీబాడీలు చివరి మూడు నెలల్లో చిన్నారిలోకి ప్రవేశించాయని చెబుతున్నారు. అయితే, ఈ కొవిడ్ యాంటీబాడీలు శిశువుకు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయన్నది తదుపరి అధ్యయనాల్లో తేలాల్సి ఉందని పలువురు వైద్యులు తెలిపారు.